This is not hindu india

 My article published in OLIVE TIMES 02 Nov, 2020 issue...


చరిత్రలో ఇండియా ఎన్నడూ

'హిందూఇండియా' అనిపించుకోలేదు... 


బైబిల్ ప్రకారం మానవ చరిత్ర సారాంశమేమిటంటే, ఆర్యులు, ద్రావిడులు, మంగోలియన్లేకాదు ఇంకెవరైనా సరే వాళ్ళు దేవుడు సృష్టించిన తొలి మానవులైన ఆదాము, హవ్వల నుండే వచ్చారు. బైబిల్ లో ఎంతటి ప్రాచీన చారిత్రక విజ్ఞానముందంటే, శాస్త్రవిజ్ఞాన రంగంలోని అన్ని విభాగాలు, సోషియాలజీ  లోని అన్ని విభాగాలూ ఆ బైబిల్ విజ్ఞానంతోనే నిండి ఉన్నాయి. మహా జలప్రళయంలో, మానవుల్లో నోవహు అతని కుటుంబం మాత్రమే బయటపడ్డారు. జలప్రళయంతో ఖాళీ అయిపోయిన ప్రపంచమంతా నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు కుటుంబాలు, వాళ్ళ తరువాతి తరాలతోనే మళ్ళీ నిండిపోయాయి. అలా జనాభా శాస్త్రంగా పిలిచే ఆంథ్రోపాలజీకి ప్రధాన మూలసమాచారమంతా బైబిల్ నుండే(ఆది 10 వ అధ్యాయం) వచ్చిందని దీన్ని బట్టి మనకు అర్ధమౌతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతం ఎవరితో నిండిపోయిందో కూడా బైబిల్ సశాస్త్రీయంగా రుజువు చేస్తుంది. యాపెతు పిల్లలు, వాళ్ళ తరువాతి తరాల వాళ్ళే యూరోప్, పశ్చిమాసియా ప్రాంతాలకు చెందిన ఇరాన్, మెసొపొటేమియా తదితర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించారని బైబిల్ చెబుతోంది.(బైబిల్ 10:5). వాళ్ళే తూర్పు మధ్యధరా ప్రాంతంలో, ఇతర ఆసియా ప్రాంతాల్లో కూడా విస్తరించారు. అందువల్ల పారశీక, పర్షియా సామ్రాజ్యాలకే చెందిన ఆర్యులు క్రీ.పూ. 2000, 1500 మధ్య కాలంలో దక్షిణాదిన ఉన్న ఇండియాకు వచ్చినపుడు తమతో పాటే తమ అన్యమత సంస్కృతిని వెంట తెచ్చుకున్నారు. వాళ్ళొచ్చేనాటికి ఇండియా మూలవాసులు ద్రావిడులు. వాళ్లదే అయిన మొహేంజొదారో, హరప్పా నాగరికతా విశేషాల ప్రకారం ద్రావిడులు ప్రకృతిని ఆరాధించేవారు. అంటే వాళ్ళు బహుదేవతారాధకులు కాదు, ఏక దేవారాధకులూ కాదు. అవేవీ కానీ ఒక విలక్షణమైన సంస్కృతి అప్పటికే వాళ్ళకుంది. 


అయితే నా ఈ వ్యాసాల్లో నేను పదే పదే చెబుతున్నట్టుగా, మన ముఖ్యమైన దృష్టి అంతా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు జీవితంలో, బోధల్లో లోకానికి వెల్లడైన దేవుని ప్రేమను ఆర్యులు, ద్రావిడులతో సహా మానవాళి యావత్తుకూ ప్రకటించడంపైనే ఉండాలి. ఆర్యులకు కానీ, వాళ్ళ సంబంధించిన మారె ఇతర సంస్కృతులు, మతాలకు కానీ  క్రైస్తవులు వ్యతిరేకం కానే కాదు. వాళ్లకూ, క్రైస్తవులమైన మనకూ మధ్య ఏ వైషమ్యమూ లేదు. క్రైస్తవులది పరాయి దేశస్థుల మతం అన్న దుష్ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టడం మాత్రమే నేను రాస్తున్న ఈ ప్రత్యేక వ్యాసాల లక్ష్యం అన్నది మీరు ఈ పాటికే అర్ధం చేసుకొని ఉంటారు.  క్రీస్తుకు పూర్వం చివరి నాలుగు శతాబ్దాల్లో యూదామతం పూర్తిగా నిర్వీర్యమైపోయి, చరిత్రలో కేవలం ఒక నామమాత్రపు మతంగా మిగిలిపోయింది. అందుకే మలాకి ప్రవక్త తర్వాత దేవుడు తన ప్రజలతో మాట్లాడటం మానేశాడు. మలాకి, కొత్త నిబంధన మధ్య గల ఆ 400 ఏళ్ళ దేవుని మౌనకాలాన్ని ఇశ్రాయేలీయుల చరిత్రలో ఎంతో అంధకార కాలంగా పరిగణిస్తారు. దేవుని ప్రజల దుర్మార్గత హద్దులు మీరిన కాలమది. అయితే అదే సమయాన్ని, దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా పంపించడానికి అనువైన కాలంగా భావించాడు. వేరే మాటల్లో చెప్పాలంటే, యూదుమతం కుప్పకూలిన కారణంగానే క్రైస్తవం ఆవిర్భవించింది. తద్వారా యేసుప్రభువు ఆయన అనుచరులు కలిసి నిర్మించిన దేవుని రాజ్యం ద్వారే  అందరికీ న్యాయం, ప్రేమ, శాంతి, సమానత్వం అందుబాటు లోకి వచ్చింది. సరిగ్గా ఇదే విధంగా, హైందవ మతం అణగారిన వర్గాలు, బహిష్కృత కులాలవాళ్ళను హద్దులు మీరు అణిచివేసిన కారణంగా క్రీస్తుకు పూర్వపు చివరి ఐదు శతాబ్దాల్లో బహుదేతారాధక వైదిక మతమైన హిందూమతం కూడా కుప్పకూలిపోయింది. ఆ కారణంగా బౌద్ధం, జైన మతం ఇండియాలో ప్రాబల్యంలోకి వచ్చాయి.

ఇండియాను కులరహిత సమాజంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రాబల్యం పొందిన బౌద్ధమతం ఇండియా అంతటా ఒక దావానలంలా వ్యాపించింది. లోతుగా వేళ్లూనుకుపోయామనుకున్న హిందూమతం అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న బౌద్ధమత ప్రాబల్యానికి కుప్పకూలిపోవడం మరోసారి దావీదు-గొల్యాతు ఉదంతాన్ని ప్రపంచానికి గుర్తుకు తెచ్చింది. ఇండియా పర్యటించిన చైనా యాత్రికులు, అప్పటి ఇండియాలోని స్థానిక చరిత్రకారులు కూడా తమ రచనల్లో ఈ విషయాన్ని సోదాహరణంగా ధృవీకరించారు. నోబెల్ బహుమతి పొందిన ఇండియా మేధావి అమర్త్య సేన్ రాసిన 'ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్' అనే పుస్తకంలో రాసిన కొన్ని వాక్యాలను ఇక్కడ నేను యధాతధంగా ప్రస్తావిస్తాను. 'క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి బౌద్ధమతం, జైన మతం ఆవిర్భవించాయి. ఇండియాలో బౌద్ధమతాన్ని ఇపుడు పాటించేవారు ఎక్కువగా లేకపోయినా, చరిత్రలో వెయ్యేళ్ళ పాటు బౌద్ధమతం ఇండియాలో అత్యంత ప్రధానమైన మతంగా వెలుగొందింది. బౌద్ధమతంతో పాటే ఆవిర్భవించిన జైనమతం కూడా కనీసం రెండు వేల ఏళ్ళ పాటు వెలుగొందింది'. అమర్త్యా సేన్ ఈ అంశాన్ని తన పుస్తకంలో పదే పదే ప్రస్తావించారు. బయటివాళ్లకు ఇండియా అప్పట్లో 'హిందూదేశం' కాదు 'బౌద్ధదేశం' మాత్రమే అంటారు గొప్ప మేధావి, మహా రచయిత అయిన అమర్త్యా సేన్. ఇండియాలో కులవివక్షకు, మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా పోరాటం చేసిన అమెరికాలో పుట్టిన ఇండియన్ మేధావి గాయిల్ ఒంవేడ్ 'బుద్ధిజం ఇన్ ఇండియా' అన్న తన పుస్తకంలో ఇలా పేర్కొన్నారు. 'ఇండియా గతానికి సంబంధించినంత వరకు, క్రీస్తుకుపూర్వం మొదటి సహస్రాబ్దిలో ఆరంభమైన పరిణామాలు ఒక నిర్దిష్ట నాగరికతను  సృష్టించేందుకు దారి చేశాయి. ఈ వెయ్యేళ్ళ తర్వాత మరో వెయ్యేళ్ళ వరకు వెలిగిన బుద్ధిజం అనే ఒక కొత్తనాగరికతను అవి  స్థాపించాయి: ప్రాచీన ఇండియా హిందూ ఇండియా కానే కాదు, అది బౌద్ధ ఇండియా మాత్రమే' అంటారా మేధావి.


నా తాత్పర్యం ఏమిటంటే, ఇండియాను 'హిందూరాజ్యం లేదా రామరాజ్యం' గా మార్చే హక్కు ఏ ఒక్క మతానికి, పార్టీకి, వ్యక్తికీ లేదు. ఒకవేళ ఎవరైనా ఆ హక్కును పొందాలనుకుంటే,  కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా న్యాయం, శాంతి, ప్రేమ, సమానత్వం అనేవి అందరికీ సమానంగా లభిస్తూ అవి పొంగిపొర్లే దేశంగా ఈ దేశాన్ని పరివర్తన చెయ్యడం ద్వారా వాళ్ళు తమ విశ్వసనీయతను ముందుగా రుజువు చేసుకోవాలి. అది మెజారిటీ మతమైనా, మైనారిటీ మతమైనా సరే, ఇండియా రాజ్యాంగం ఏ ఒక్క మతానికీ ఎలాంటి ప్రత్యేక హోదానివ్వదని కూడా మనమంతా గుర్తుంచుకోవాలి. అన్నింటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇండియా రాజ్యాంగ పరిమితులు, అందులోని హక్కుల మేరకు, రాజ్యాంగపు 25-28 వ అధికారణాల ద్వారా క్రైస్తవులకు తమ మతాన్ని ఆచరించి, ప్రకటించి, ప్రచారం చేసుకునే పూర్తి హక్కులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉన్నాయి !!

Pastorvaraprasad 9618473725

Comments

Popular posts from this blog

Graham stains life story telugu

తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?*